Ramoji Rao Real Life Story : అక్షర యోధుడు, మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) ఇకలేరు. గతకొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈనెల 5న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్సపొందుతూ ఈరోజు జూన్ 7న (శనివారం) రామోజీరావు (Ramoji Rao Passes Away) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను (Ramoji Rao Death Funerals) అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
రామోజీరావు బయోగ్రఫీ.. ప్రస్థానం మొదలైందిలా :
రామోజీ బయోగ్రఫీ.. (Ramoji Rao biography) 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన ముత్తాత పామర్రు మండలం పెరిచేపల్లి గ్రామం నుంచి పెదపారుపూడి వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. రామోజీరావు జన్మించే నాటికి 16 రోజులు ముందు అతని తాతయ్య రామయ్య మరణించడంతో పుట్టే బిడ్డకి తన తండ్రి పేరు రామయ్య అని పెట్టారు రామోజీరావు నాన్నగారు.
ఐదేళ్ల వయసులో బడికి వెళ్లినప్పుడు ఆ స్కూల్ మాస్టర్ మీ పేరేమిటి అని అడిగినప్పుడు.. నా పేరు రామోజీరావు అని చెప్పారట. ఆ విషయం వాళ్ల నాన్నగారికి తెలిసి అదేమిటిరా రామయ్య అని తాతయ్య గారి పేరు పెడితే రామోజీరావు అని మార్చుకున్న ఎందుకు అని అడిగారు. రామయ్య అంటే ముసలోళ్ల పేరులా ఉంటుందని నేనే మార్చుకున్నాను నాన్న అని రామోజీరావు ఆయనకి సమాధానం చెప్పారు. ఊర్లో ఎవరైనా రామయ్య అని పిలిచిన వారిని ఏమీ అనకుండా తన పేరు రామోజీరావు అని ఇకనుంచి అలాగే పిలవండి అని చెప్పేవారట.
రామోజీరావు చదువు సాగిందిలా :
పెదపారుపూడిలో ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక దగ్గరలో ఉన్న గుడివాడ మున్సిపల్ హైస్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. రోజు స్కూలు నుంచి వచ్చాక వాళ్ళ అమ్మగారికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు. నూతిలో నుంచి నీళ్ళు తోడై మొక్కలకు నీళ్లు పోయడం లాంటి పనులు కూడా చేసేవారు. ఇంట్లో పాలేరులు ఉన్నా కూడా వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉండేవారు. ఇంటి పనులు అయ్యాక కొంత సమయం ఆటలు, మరికొంత సమయం చదవడం.. చదవయ్యాక బొమ్మలు గీస్తుండేవారు. ఎక్కువగా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవారు రామోజీరావు. 1951లో ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యాక గుడివాడలో ఉన్న డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ బీఎస్సీ చదివారు. ఈ కాలేజీ తర్వాత కాలంలో ఏఎన్ఆర్ కాలేజ్‌గా మారింది.
ఉద్యోగం మానేసి వ్యాపారం వైపు అడుగులు :
ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే కమ్యూనిజం పట్ల ఆకర్షితులై ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్డ్ హోల్డర్‌గా చేరారు రామోజీరావు. 1957లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ, రామోజీరావు సెలెక్ట్ కాలేదు. ఈ విషయం ఆయన ఎంతగానో బాధపెట్టింది. అవమానంగా భావించారు. తిరిగి ట్రైన్‌లో ఊరు వస్తున్నప్పుడు ఆయన మనసులో అనుకున్నాడు. ఏదిఏమైనా నేను వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని అప్పుడే గట్టిగా అనుకున్నారట.
ఆ తర్వాత 1960లో ఢిల్లీలో ఒక ఎడ్ ఏజెన్సీలో చిత్రకారుడుగా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక వ్యాపార సంస్థలో ఉండే మెలకువలు, లాభనష్టాలు సాధక బాధకాలు గమనించేవారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే అమెరికా వెళ్లే అవకాశం వచ్చిన ఆయన వదులుకున్నాడు. ఆ తర్వాత 1961 ఆగస్టు 19న పెనమలూరికి చెందిన పెనమలూరి రమాదేవితో విజయవాడలో ఉన్న కన్యకా పరమేశ్వరి మందిరంలో వివాహం జరిగింది.
రామోజీరావు నమ్మిన సూత్రాలివే :
అప్పటికి రామోజీరావు వయసు 25 సంవత్సరాలు. ఆయన పెళ్లయ్యాక ఢిల్లీలో కరోల్ బాగ్ అనే తెలుగువారు ఉన్న ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. హిమాయత్ నగర్‌లో 85 రూపాయలకు అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాడు. అదే సమయంలో 1962 మే 21న పెద్దకొడుకు కిరణ్ జన్మించారు. 1962 అక్టోబర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ మొదలుపెట్టారు.
ఈ కంపెనీ పెట్టినప్పుడు చాలామంది ఎగతాళి చేసేవారు. ఇంటిలో ఆడవాళ్లు చేసే పనికి కంపెనీ అవసరమాని అనేవారు. కానీ, రామోజీరావు అవేమీ పట్టించుకోలేదు. ఆ సమయంలో ఆయన కొన్ని సూత్రాలు నమ్ముకున్నాడు. అందులో ఒకటి.. వినియోగదారుల పట్ల గౌరవం.. రెండు వాళ్లకు నమ్మకం ఇవ్వడం.. మూడోది తన సంస్థలో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణ ఇవ్వడం. నాలుగోది చేసే ప్రతి పనిలోనూ అంకితభావం. ఇవి ఉంటే ఎలాంటి వ్యాపారమైన అభివృద్ధి చెందుతుంది అంటారు రామోజీరావు.
రైతుల కోసం అన్నదాత మాసపత్రిక :
చిట్‌ఫండ్స్ కంపెనీ అభివృద్ధి చెందుతున్నప్పుడే 1965లో కిరణ్ యాడ్స్ అని అడ్వర్టైజ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1966 డిసెంబర్ 23న రెండో కొడుకు సుమన్ జన్మించారు. 1967లో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి వసుంధర ఫెర్టిలైజర్ అనే ఎరువులు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ ఎరువులు కంపెనీ రెండు సంవత్సరాలకే భారీ నష్టాలు రావడంతో తన నలుగురు భాగస్వాములకు పెట్టుబడి నష్టమంత రామోజీరావే భరించి ఆ కంపెనీని మూసేశారు. ఆ తర్వాత నుంచి ఆయన భాగస్వామ్య వ్యాపారం చేయలేదు.
ఎరువులు వ్యాపారం మూతపడిన రైతులకు ఏదైనా చేయాలన్న ఆయన ఆలోచన మాత్రం మారలేదు. దాని ఫలితమే అన్నదాత. 1969 జనవరిలో అన్నదాత అనే మాస పత్రికని ప్రారంభించారు. ప్రారంభంలో ఈ మాసపత్రిక ధర ఒక్క రూపాయి మాత్రమే. మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే ఈ మాసపత్రిక రైతులకి ప్రియనేస్తంగా మారింది. ఆ తర్వాత 1970 నవంబర్ 26న రామోజీరావు సతీమణి రమాదేవి ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన దృష్టి విశాఖపట్నం మీద పడింది. అభివృద్ధి చెందుతున్న నగరం అది. విశాఖపట్నంలో సరైన హోటల్ లేదని తెలుసుకొని అక్కడ ఒక హోటల్ నిర్మించాలనుకున్నారు.
అప్పుడే ఈనాడు పేపర్ పెట్టాలనే ఆలోచన :
వెంటనే ఒక స్థలం లీజికి తీసుకొని సంభీమ్ పేరుతో హోటల్ నిర్మించాలనుకున్నారు. అయితే, ఆ పేరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో డాల్ఫిన్ పేరుతో హోటల్ నిర్మించారు. ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం వచ్చి సన్ అండ్ షిలో బస్ చేస్తుండేవారు. న్యూస్ పేపర్ చదువుతుండేవారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న న్యూస్ పత్రికలన్నీ ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి ఇవే ఉండేవి. ఇవి విజయవాడలో ప్రింట్ అయ్యి విశాఖపట్నం మధ్యాహ్నానికి వచ్చేవి. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.
విశాఖపట్నంలోని ఒక వార్తాపత్రిక ప్రచురణ ఉంటే ఎలా ఉంటుంది అని ఆ సమయంలో విమానంలో విశాఖపట్నం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ తారసపడ్డారు. ఆయన్ని కలిసి ప్రసాద్ గారు మీరు విశాఖపట్నంలో కూడా ముద్రణ చేయొచ్చు కదా అని అడిగారు. కానీ, ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు, రామోజీరావు గారు ఆలోచించి నేనే ఇక్కడ న్యూస్ పేపర్ మొదలుపెట్టి ముద్రించితే బాగుంటుంది అని ఆలోచించారు. వెంటనే డాల్ఫిన్ హోటల్ పనులని వాయిదా వేసి పత్రిక పనులు ముమ్మరం చేశారు. పత్రిక కోసమే ఆయన చాలా ఆలోచించారు. అంతవరకు ఆంధ్ర పేరుతోనే పత్రికలన్నీ ఉన్నాయి. తన పత్రిక పేరు కొత్తగా ఉండాలని ఆయన ఆలోచించారు. అప్పట్లో నార్త్ ఇండియాలో ఆర్ట్ అనే పేరుతో ఒక పత్రిక వస్తుండేది. దాని ఆధారంగా ఈనాడు అని తన పత్రికకి పేరు పెట్టారు.
90 లక్షల మంది చదవడమే లక్ష్యంగా :
ఇప్పుడు మనం చూస్తున్న ఈనాడు పేరుని నార్లకంటి స్వామి డిజైన్ చేశారు. ఈయనే ఈనాడుతో పాటు వసుంధరా, అన్నదాత, సితార, న్యూస్ నైట్, న్యూస్ టుడే, ఉషాకిరణ్ మూవీస్, డాల్ఫిన్ హోటల్, కిరణ్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. ఈనాడుకి ఆఫీస్ కోసం సీతమ్మధార అనే ప్రాంతంలో నక్కవానిపాలెంని ఎంచుకున్నారు. అక్కడ ఒక రేకుల షెడ్డు ఉంటే దాన్ని లీజికి తీసుకున్నారు. వాళ్ల దగ్గరే పత్రిక కొన్నారు. చురుకుగా పనిచేసే యువకుల్ని ఎంపిక చేశారు.
13 మంది సబ్ ఎడిటర్స్‌ని ఎంపిక చేసి ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఏవీకే ప్రసాద్ గారిని సంపాదికత్వానికి నాయకుడిగా నియమించారు. అందరిని పిలిపించి రేకుల షెడ్డు దగ్గర ఒక మర్రిచెట్టు ఉంటే.. అక్కడ మొదటి మీటింగ్ పెట్టారు రామోజీరావు. అందరితో మాట్లాడుతూ.. దేశంలో మొత్తం తెలుగు మాట్లాడేవారు 6 కోట్ల మంది ఉన్నారు. అందులో కోటిమంది అక్షరాస్యులు ఉన్నారు. ఇప్పుడున్న ఆ మూడు పత్రికలు సర్కులేషన్ రెండు లక్షలు మాత్రమే. ఒక్కొక్క పేపరు 5 మంది చదివిన 10 లక్షల మందికి మించి చదవడం, మిగతా 90 లక్షల మంది మన లక్ష్యం కావాలన్నారు.
ప్రింట్ అయ్యాక ఫస్ట్ ఆయనే పేపర్ చదివేవారు :
దీన్ని మొదట ప్రాంతీయ పత్రికగా తర్వాత రాష్ట్రస్థాయి పత్రికగా ఆ తర్వాత జాతీయస్థాయి పత్రికగా తీసుకువెళ్లాలని ఉద్యోగులందరికీ దిశా నిర్దేశం చేశారు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 5 గంటలకి పత్రిక అందరికీ అందిపోవాలని చెప్పారు. అలాగే మన పత్రికలో కచ్చితంగా కార్టూన్ ఉండాలని చెప్పారు. అంతా సిద్ధం అయ్యాక 1974 ఆగస్టు 10 శనివారం సాయంత్రం ఎలాంటి హంగు హార్భాటాలు లేకుండా అందులో పనిచేసే సాధారణ కార్మికులతో ముద్రణా యంత్రం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
మొత్తం 42 మంది ఉద్యోగులతో మొదలైంది. ఈనాడు సాయంత్రం 6:00కి పేపర్ మొత్తం ముద్రణ అయ్యాక మొదటిసారి రామోజీరావు గారే పేపర్ చదివారు. స్టాఫ్ అందరికీ టిఫిన్ బాక్సులు బహుమతులుగా ఇచ్చారు. ఆగస్టు 11 ఉదయం 5 గంటలకి ఈనాడు వార్తాపత్రిక ఐదు వేల పత్రులతో విశాఖ ప్రజల్ని పలకరించింది. ఆరోజు విశాఖలో పెద్ద కోలాహలం మొదలైంది. ఆ పేపర్ ధర కేవలం 25 పైసలు మాత్రమే.
Ramoji Rao Real Life Story : అదే ఈనాడు విజయానికి తొలిమెట్టు :
మొదట పత్రిక మొదటి పేజీలో అమెరికా అధ్యక్షుడు నిక్షన్ రాజీనామా, అలాగే ఆముదాలవలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందుల గురించి వేశారు. అంతర్జాతీయ వాటికి ఎంతటి విలువని ఇచ్చారో ప్రాంతీయవార్తకు కూడా అంతే విలువిచ్చారు రామోజీరావు. అదే ఈనాడు విజయానికి తొలిమెట్టు అయింది. ఆ వార్తను చదివిన ప్రజలందరూ గొప్పగా ఫీలయ్యారు. అంతర్జాతీయ వార్తా పక్కన మన ఊరు వార్త వచ్చింది అని సంతోషపడ్డారు. ఆ తర్వాత ముద్రణకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కరెంట్ కోత ముద్రణకి అక్షరాలని చేతులతో అద్దడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రామోజీరావు మాత్రం వాటన్నింటిని అధిగమించి పత్రిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకి ప్రతి ఇంటి గుమ్మంలో ఉండాలని తలపించారు. అలాగే చేశారు కూడా. అలాగే సమరం గారితో లైంగిక వ్యాసాలు రాయించేవారు. అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాదులో రెండో ఎడిషన్ ప్రారంభించారు. అప్పటికి 5000 సర్కులేషన్‌తో ఉన్న ఈనాడు హైదరాబాదులో మొదలెట్టడంతో 13 వేలకు చేరింది. 1977 నాటికి 48 వేలకు చేరింది. కొన్ని ఇబ్బందుల తర్వాత మూడో ఎడిషన్ 1978లో విజయవాడలో ప్రారంభించారు.
1983లో సినిమా రంగంలోకి ప్రవేశం :
ఆ తర్వాత సితార, చతుర, వీపుల, తెలుగు వెలుగు, బాలభారతం వంటి మరికొన్ని వార పత్రికలు, మాసపత్రికలు ప్రారంభించారు. 1983లో సినిమా రంగంలో కూడా కాలుమోపారు. 1983లో ఉషాకిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి మొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా నిర్మించారు. 2017లో వచ్చిన దాగుడుమూత దండాకోరు వరకు 40 సినిమాలు నిర్మించారు. 1993 ఫిబ్రవరి 26న ప్రియా పచ్చళ్ళు ప్రారంభించారు. ఆ తర్వాత అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. ఆ తర్వాత 1995లో టెలివిజన్ రంగంలో అడుగు పెట్టారు. 1995 ఆగస్టు 27న ఈటీవీ ప్రారంభించారు. అందులో ప్రతిరోజూ ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించారు. ఆ తర్వాత కన్నడ, మరాఠి, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, బీహార్ భాషలలో కూడా ఈటీవీ ప్రారంభించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీ :
1996లో 2వేల ఎకరాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. పర్యాటకంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఫిలిం సిటీకి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చాక రామోజీరావు పేరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా దేశమంతటా మార్మోగింది. రామోజీ ఫిలిం సిటీ నిర్మించాక ఈటీవీని ఫిలిం సిటీలోకి షిఫ్ట్ చేశారు. ఫిల్మిం సిటీలోనే తన ఇంటిని కూడా నిర్మించుకున్నారు. రామోజీ అది ఒక కొండమీద నిర్మించారు. పక్కనే సంఘీ టెంపుల్ ఉండడం వలన ఆ టెంపుల్ శిఖరం కన్నా ఎత్తు ఉండకూడదని ఆ ఇంటిని అంతటతోనే ఆపేశారు. లేకపోతే చాలా పెద్ద ఇల్లు కట్టాలనేది ఆయన ఆలోచన.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి :
ఈనాడు 46 ఏళ్లుగా నిర్విరామంగా నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతుంది. 25 ఏళ్లుగా ఈటీవీ మిగతా వ్యాపారాలు కొనసాగుతున్నాయి అంటే అది ఆషామాషీ విషయం కాదు. ఒక సమర్థవంతమైన నాయకుడు తన ఉద్యోగస్తుల్ని సమర్థవంతమైన ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతాడు అని రామోజీరావు నిరూపించారు. ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా లక్షకుపైగా ఉద్యోగాలు ఇస్తున్నారు రామోజీరావు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి వేలాది మందికి పని కల్పించి శిఖరాన్ని తాకిన శిల్పి రామోజీరావు. ప్రస్తుతం పెద్ద కొడుకు కిరణ్ చిన్న కొడుకు సుమన్ పిల్లలకి రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాధ్యతలు అప్పగించారు.
