Ganesh Jayanti 2023 : ఓ గణేశాయ నమ:.. విఘ్నరాజాయ నమ:.. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా సరే.. ముందుగా గణనాథుడిని పూజించాల్సి ఉంటుంది. అప్పుడే చేపట్టిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విగ్నంగా ముందుకు సాగుతుంది. అదే గణనాథుడికి పూజ చేయకుండా పని మొదలుపెడితే.. ఆ పనికి అడుగడుగునా ఆటంకాలే చుట్టుముడుతాయని అంటుంటారు. మనుషులకే కాదు.. పురాణాల్లోని దేవతలకు సైతం విఘ్నాల నుంచి తప్పించుకోలేకపోయారు. అందుకే అందరికి కన్నా ముందుగా పూజలందుకుంటున్నాడు గణనాథుడు.. ఆయనే ఆది దేవుడిగా నిలిచాడు. విఘ్నాలను తొలగించేవాడిగా మారాడు. హిందూ పండుగల ప్రకారం.. ప్రతి ఏడాదిలో భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో నాల్గో దినాన చతుర్థి నాడు వినాయక చవితి పండుగ వస్తుంది. ఇదే రోజున గణనాథుడు జన్మించాడని పురాణా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ గణనాథుడు పుట్టుక ఎలా జరిగింది? ఆది దేవుడు ఎక్కడ జన్మించారు? అసలు వినాయకుడి జన్మరహాస్యానికి సంబంధించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పురాణాల్లో గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు శివ భక్తుడు. పరమేశ్వరుని గురించి కఠోర తపస్సును ఆచరించాడు. అతడి తపస్సుకు దిగొచ్చిన శివుడు ఏం కావాలో కోరుకోవాలని అడిగాడు. అందుకు రాక్షసుడు.. పరమేశ్వరుని తన కడుపులో కోలువై ఉండాలని వరం అడుగుతాడు. వెంటనే శివుడు తధాస్తు అంటాడు.
శివుడు గురించి పార్వతిదేవికి తెలియడంతో వెంటనే మహా విష్ణువుని సాయం కోరుతుంది. బ్రహ్మాదేవుడితో కలిసి మహా విష్ణువు, నంది గజాసురుడి వద్దకు వెళ్లి ఆడతారు. వారి ఆటకు తన్మయత్వం చెందిన గజాసరుడు ఏం వరం కావాలో కోరుకోవాలని అడుగుతాడు. ఆ సమయంలో విష్ణువు ఇలా అడుగుతాడు.. నీ ఉదరంలోని శివుడిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతాడు. అలా అడిగింది మహా విష్ణువు అనే విషయాన్ని గుర్తించిన గజాసురుడు తన ఉదరాన్ని చీల్చి తీసుకెళ్లాలని అడుగుతాడు. అప్పుడు నందీశ్వరుడు అలానే చేస్తాడు. గజాసురుడు చనిపోయే ముందు ఒక కోరిక కోరుతాడు.. తన తలను ముల్లోకాలు ఆరాధించాలని కోరుతాడు. తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని అడుగుతాడు. ఆ తర్వాత శివుడు గజాసురుడు ఉదరాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు. నేరుగా అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరుతాడు. ఆ విషయం తెలియగానే పార్వతిదేవి చాలా సంతోషపడుతుంది.
శివుడు రావడానికి ముందుగానే అందంగా అలంకరించుకోవాలని భావిస్తుంది. అప్పుడే నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారుచేస్తుంది. చూడముచ్చటగా ఉన్న బాలుడి రూపాన్ని చూసి మరింత ముచ్చటపడిన పార్వతిదేవి ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత తాను స్నానానికి వెళ్తూ ఆ బాలుడిని ప్రవేశ ద్వారం ముందు నిలబడమని చెబుతుంది. తాను స్నానమాచరించే సమయంలో ఎవరిని లోపలికి రావొద్దని బాలుడిని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాటను జవదాటకుండా బాలుడు అలానే చేస్తాడు. అయితే, అదే సమయలో కైలాసగిరి శివుడు వస్తాడు. అప్పుడు ప్రవేశమార్గంలో నిలుచున్న బాలుడు శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. శివుడు ఎంతగా హెచ్చరించినా బాలుడు మాట వినిపించుకోడు. తల్లి ఆదేశాలను తప్పకుండా ఉండేందుకు మహాశివుడితోనే వైరానికి కాలుదువ్వుతాడు.
Ganesh Jayanti 2023 : వినాయకుడు విఘ్ననాయకుడిగా మారాడు ఇలా..!
ఈ క్రమంలో శివుడు ఆగ్రహానికి గురవుతాడు. శివుడు ఆ బాలుడి తలను తన త్రిశూలంతో ఖండిస్తాడు. అదే సమయంలో స్నానమాచరించిన పార్వతిదేవి బయటకు వస్తుంది. శివుడిని చూడగానే సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కడే రక్తపుమడుగులో పడి ఉన్న పసిబాలుడిని చూసి పార్వతిదేవి తల్లడిల్లిపోతుంది. ఈ దారుణం ఎవరూ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు శివుడు ఈ పిల్లవాడు ఎవరూ అని అడగడంతో మన బాబేనంటూ చెబుతుంది. చనిపోయిన బాలుడిని ఎలాగైనా ప్రాణం పోయాలని పార్వతిదేవి కోరుతుంది. పరమ శివుడు వెంటనే గజాసురుడి తలను తీసుకొచ్చి బాలుడి ధరింపజేస్తారు. గజాసురుడు కోరుకున్నట్టుగా ఆయన తలను బాలుడికి అతికించడంతో అప్పటినుంచి గణేశుడిగా పిలువబడుతున్నాడు.

ప్రథమ ప్యూజుడు ఎవరు అనేది తేల్చుకోవాలని శివుడు తన ఇద్దరు కుమారులైన వినాయకుడు, కుమారస్వామికి ఆదేశిస్తాడు. ఎవరైతే ఇందులో గెలుస్తారో వారే ఆది దేవుడిగా నియమితులవుతారని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరూ పోటీపడతారు. అంతకముందు.. దేవతలంతా కలిసి శివపార్వతుల దగ్గరికి వెళ్తారు. ఏదైనా పనిచేసే సమయంలో విఘ్నాలు రాకుండా నిర్విగ్నంగా కొనసాగేందుకు ఏదైనా పూజ ఉందా? అని కోరతారు. విఘ్ననాయకుడు ఎవరూ అనేది తేల్చుకోవాలని కుమారస్వామి, వినాయకుడికి పోటీ పెడతారు. వీరిద్దరూ ముల్లోకంలో పుణ్య నదులన్నింటిలో స్నానమాచరిస్తారు.
అలా ఎవరైతే ముందుగా కైలాసాన్ని చేరుతారో వారే ఆది దేవుడిగా నిలుస్తారని చెబుతారు. అప్పుడు కుమార స్వామి తన నెమలి వాహనం ఎక్కి ముల్లోకాలకు పయనమవుతాడు. కానీ, వినాయకుడికి మాత్రం ఏ వాహనం లేదు. తాను ఎలా వెళ్లాలో తెలియలేదు. కానీ, ఇక్కడ వినాయకుడు తన వివేకాన్ని చూపించాడు. తన బలం, బలహీనతలు తెలుసుకుంటాడు. అదే సమయంలో శివుడు గణనాథుడికి ఓ మంత్రాన్ని ఉపదేశమిస్తాడు. తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని అంటాడు. తండ్రి చెప్పిన మాటలతో వినాయకుడు శివపార్వతుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ ఆ మంత్రాన్ని జపిస్తాడు.
వినాయకుడి కన్నా ముందుగానే ముల్లోకాలను చుట్టివస్తున్న కుమారస్వామికి వెళ్లిన ప్రతిచోట గణనాథుడు కనిపిస్తాడు. కుమార స్వామి వెళ్లడానికి ముందుగానే వినాయకుడు పుణ్యనదుల్లో స్నానమాచరించి వెళ్తూ కనిపిస్తాడు. చివరికి అన్ని తిరిగొచ్చాక కుమారస్వామి అసలు నిజం తెలుసుకుంటాడు. తనను మన్నించి ఆది దేవుడు పదవిని అగ్రజుడు వినాయకుడి ఇవ్వడమే సరైనదిగా కుమారస్వామి చెబుతాడు. అలా గణనాథుడు విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడిగా మారిపోతాడు. ఆ రోజు నుంచి ఎవరూ ఏ పని లేదా పూజలు, యగ్నాలు చేసినా ముందుగా ఆది దేవుడు గణనాథుడిని పూజించిన తర్వాతే మొదలుపెట్టడం చేస్తుంటారు. అప్పటినుంచి గణనాథుడు ప్రథమ ప్యూజిడిగా పేరు వచ్చింది.