Miral Movie Review : మిరల్ మూవీ రివ్యూ.. భరత్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Miral Movie Review : మిరల్ మూవీ రివ్యూ.. ఇదో హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. కళ్ల ముందు కనిపించే సన్నివేశాలు అత్యంత భయానకంగా ఉంటాయి. ప్రేక్షకులను ఏ క్షణం ఏం జరుగుతుందా? అనే తెలుసుకోవాలనే స్థితికి తీసుకెళ్లేలా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన భరత్.. తన పాత్రకు ప్రాణం పోశాడు. అప్పట్లో ప్రేమిస్తే సినిమాతో మెప్పించిన భరత్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల కోసం హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. భరత్ సరసన వాణి భోజన్ హీరోయిన్‌గా నటించగా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ ‘మిరల్’ మూవీని తెరకెక్కించింది.

ఈ చిత్రానికి సీహెచ్ సతీష్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. 2022 ఏడాదిలో తమిళ్ వెర్షన్‌లో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మిరల్ (Miral Tamil Movie) మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తమిళ ప్రేక్షకులను మిరల్ మూవీ అతిగా భయపెట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు 2024లో తెలుగు వెర్షన్‌లో మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరల్ మూవీ మిక్సడ్ టాక్ అందుకుంది. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ప్రేక్షకులను భయపెట్టేస్తుంది. అన్ని హర్రర్ మూవీల మాదిరిగానే ఇది కూడా ఉందా? ఏమైనా అంచనాలు అందుకుందా? మొత్తం మీద మిరల్ మూవీ (Miral Telugu Movie Review) ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో వివరంగా తెలుసుకుందాం.

Miral Movie Review : మిరల్ మూవీ స్టోరీ‌లైన్ (Story) : 

ముసుగు మనిషి రూపంలో వచ్చే కలలతో రమ (వాణి భోజన్) మానసిక క్షోభకు గురౌతుంది. ఆర్కిటెక్ట్ (సివిల్ ఇంజనీర్) అయిన ఆమె భర్త హరి (భరత్) ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక, రమ తల్లితండ్రులు దంపతులను పొలాచిలోని వారి కుటుంబ ఆలయాన్ని సందర్శించి వారికి మంచి జరగాలని కోరుకుంటారు. అదే మార్గంలో వారు వెళ్లే కారు పాడు అవుతుంది. అదే సమయంలో ముఖంపై ముసుగుతో ఉన్న విచిత్రమైన అపరిచితుడిని ఎదుర్కొంటారు. వారు అతనిని నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది కథలోని ట్విస్ట్. మిరల్ ఒక ముసుగు మనిషి మరియు అద్దం కారణంగా భయాలను అనుభవించే యువతి చుట్టూ తిరుగుతుంది.

ముసుగు మనిషి కారణంగా ఆమె భర్త, బిడ్డకు ఎదురయ్యే భయంకరమైన కల. ప్రతినిత్యం కలవరపరిచే కలలు, అశాంతికరమైన సంఘటనలతో రమ బాధపడుతుంటుంది. తమను ఎవరో ఫాలో అవుతున్నారని, చంపేందుకు వెంటాడుతున్నారని భ్రమలో ఉంటుంది. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుంది.. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలుసుకునే పనిలో పడతాడు హరి. అలా సమాధానం కోసం అతని ప్రయాణం మొదలవుతుంది. కానీ, ప్రతిచోట అతడికి నిరాశే ఎదురువుతుంది. ఎలాగైనా పరిష్కారాన్ని కనుగొనాలని నిశ్చయించుకున్న హరి.. రాముని పూర్వీకుల గ్రామంలో సాంప్రదాయక ఆచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

తన భార్య, చిన్న కొడుకుతో కలిసి పూజ చేసేందుకు ఓ చిన్న గ్రామానికి వస్తాడు. కానీ, వారు సిద్ధమవుతున్నప్పుడు కలవరపెట్టే సంఘటనలు ఒక్కసారిగా ఎదురవుతాయి. రమ కలలో వచ్చిన ముసుగు వ్యక్తి నిజంగానే వాళ్లను చంపే ప్రయత్నం చేస్తాడు. చాలా ఏళ్ల క్రితం కూడా అచ్చం ఇలాంటి ఘటనే జరిగిందని ఊరిజనం చెప్పుకుంటారు. వాస్తవానికి హరి కుటుంబాన్ని వెంటాడే వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. హరి కుటంబుతో అతడికి ఉన్న సంబంధం ఏంటి? రమకి ముసుగు మనిషి ఎందుకు కలలో వస్తున్నాడు. ఈ భయానక పరిస్థితుల్లో హరి తన కుటుంబాన్ని ముసుగు మనిషి నుంచి ఎలా రక్షించుకుంటాడు అనేది మూవీ చూస్తే గానీ క్లారిటీ రాదు.

గతంలో తమ కుటుంబానికి సంబంధించి సొంత రహస్యాలను రమ తల్లిదండ్రులను (కెఎస్ రవి కుమార్, మీరా కృష్ణన్) కలుసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ రహస్యం ఏంటో ఛేదించే ప్రయత్నంలో హరి సన్నిహిత మిత్రులు ఆనంద్ (రాజ్ కుమార్), అతని భార్య హేమ (కావ్య అరివుమణి) అదే గ్రామంలో ఉంటారు. స్థానిక పోలీసు అధికారి (అర్జై) కూడా వీరితో కలుస్తారు. వింత సంఘటనలను పరిశోధించే క్రమంలో అతడు కూడా ఈ సస్పెన్స్ డ్రామాలో చిక్కుకుంటాడు. గడిచే ప్రతి క్షణంతో, ఈ పాత్రల మధ్య సంబంధాలు లోతుగా మారుతాయి. ఆచారంతో ముడిపడి ఉన్న ఊరి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. కలతపెట్టే సంఘటనలతో పాటు తన భార్య దీనస్థితికి సమాధానాలు కనుగొనడంలో హరి విజయం సాధిస్తాడా? ఈ సమస్యను రమ ఎలా అధిగమిస్తుంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే..

మూవీ విశ్లేషణ :
మిరల్ హరర్ మూవీలో అతీంద్రియ సంఘటనలు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించేలా ఉంటాయి. రమను వెంటాడేది దయ్యమా? లేదా సైకోనా అనేది రివీల్ చేయకుండా చివరి వరకు సస్పెన్స్‌గా కొనసాగుతుంది. ఇందులో ఊహాజనిత ప్లాట్ ట్విస్ట్ చిత్రం మొదట్లో ఆసక్తికరంగా ఉంటుంది. సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్‌లను సమర్థవంతంగా ఉపయోగించడంతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసినప్పటికీ, ప్రీ-క్లైమాక్స్‌లో రివీల్ చేయడం నిరాశకు గురిచేస్తుంది. ఈ మూవీలోని సన్నివేశాలు కొద్దిమంది నటుల చుట్టే తిరుగుతుంటుంది. భరత్, వాణి భోజన్ వీరిద్దరూ మూవీ మొత్తాన్ని భుజాన వేసుకుని మరి నడిపించారు.

Miral Movie Review And Rating in Telugu
Miral Movie Review And Rating in Telugu ( Photo Credit : Google )

నటీనటుల ప్రదర్శన (Cast ) :

శృంగారభరితమైన పాత్రలకు పేరుగాంచిన భరత్, ప్రేమ, భయం, దుఃఖం భావోద్వేగాలను ప్రదర్శిస్తూనే భార్య పట్ల చింతించే భర్తగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. వాణీ భోజన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. తనను ఎవరో వెంటాడుతున్నారనే బాధాకరమైన అనుభవాన్ని తన హవాభావాలతో ప్రదర్శిస్తూ అందరిని మెప్పించింది. కె.ఎస్.రవికుమార్ (మామగారి పాత్ర)లో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఆయన పాత్ర కొంతవరకు కల్పితమైనదిగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, రాజ్‌కుమార్ కీలక పాత్ర మూవీకి నిజంగా బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అతని పాత్రకు తగినట్టుగా సన్నివేశాలు కూడా అత్యంత ప్రామాణికతను తీసుకొచ్చాయి.

మూవీ ప్లస్ పాయింట్స్ :
మిరల్ మూవీలో భరత్ రోల్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. తన దైన శైలిలో నటనతో అందరిని మెప్పించాడు. ఫస్టాప్ కన్నా సెకండాఫ్‌లో భరత్ సీన్లపై బాగా రెస్పాన్స్ వచ్చింది. నటన పరంగా భరత్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నటి వాణి భోజన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా నటుల విషయానికి వస్తే.. ఎవరికి వారు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. మొత్తంగా ఈ క్రైమ్ థ్రిలర్ల్ మూవీ పలు సీన్లలో సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్కులు పడ్డాయనే చెప్పాలి.

సినిమాలో మైనస్ పాయింట్స్ :
మిరల్ హరర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను కనెక్ట్ చేసే అంశాలు పెద్దగా లేవనే చెప్పాలి. దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ పర్‌ఫెక్ట్ అయినప్పటికీ తాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో విజయవంతం కాలేదని అనిపిస్తుంది. ఈ సినిమా మొదట్లోనే కాన్సెప్ట్ అనే విషయం వెంటనే గ్రహించేలా ఉండటంతో సగటు ప్రేక్షకుడికి ఈ మూవీ ఏంటి అనేది అర్థమై పోతుంది. అనవసర ట్విస్టులతో సినిమాలోని సీన్లను రక్తికట్టించడానికి సాగదీత ప్రేక్షకులకు బోర్ కట్టించేలా ఉంది. భయపెట్టే సీన్ల విషయానికి వస్తే.. అంతగా మెప్పించేలా లేవని చెప్పవచ్చు. తెలుగు డబ్బింగ్ మైనస్ పాయింట్స్ అనిపిస్తుంది. నాసిరకంగా డబ్బింగ్ ఉండటంతో చూసే ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా ఉంది.

టెక్నికల్ అంశాలు :
మిరల్ హరర్ మూవీలో ప్రేక్షకులకు భయానక భావాన్ని సృష్టించడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అతిగా ఆధారపడ్డారని అనిపించకమానదు. అయినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కరకంగా ప్లస్ అయిందనే చెప్పాలి. భయానక అంశాలకు సంబంధించి నమ్మదగిన విధంగా సన్నివేశాలను చూపించకుండా షాక్ వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడినట్టు కనిపించింది. అది కేవలం భయం మాత్రమే అందులో నిజం లేదనే విషయాన్ని చివరికి వరకు కంటిన్యూలో చేయడంలో విఫలమైనట్టు అనిపించింది. కానీ, సినిమాటోగ్రఫీ పరంగా విజువల్స్ బాగా వచ్చాయి.

సాంకేతిక అంశాలు కూడా ప్రశంసించదగినవి అయినప్పటికీ, పేలవమైన స్క్రిప్ట్ కారణంగా చివరికి వృథా అయ్యాయని చెప్పవచ్చు. ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో భయాన్ని సృష్టించడంలో ప్రభావవంతంగా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా, సురేష్ బాలా ద్వారా సినిమాటోగ్రఫీ, కలైవానన్ ఎడిటింగ్ ప్రభావవంతమైన జంప్ స్కేర్స్ క్రియేట్ చేశాయి. కానీ, ఆకట్టుకునే కథన నేపథ్యం లేకుండా ఈ క్షణాలు ఏదో తెలియని వెలితిగా అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ అనేది ప్రేక్షకులు కథనంతో నిమిషాల వ్యవధిలో డిస్‌కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఏది ఏమైనా.. స్టోరీ రొటిన్ అయినా స్క్రీన్ ప్లే బాగుంది. చివరిలో ట్విస్ట్ చూస్తే దీనికోసమేనా ఇదంతా అనిపించక మానదు. సాంకేతికంగా మిరల్ అద్భుతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ శక్తివేల్ ప్రేక్షకులను భయపెట్డడంలో విజయం సాధించడానే చెప్పాలి. హరర్, థ్రిల్లర్ మూవీలంటే బాగా ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఈ మూవీని సినిమా థియేటర్లలోనే చూడాలి. ఎందుకంటే.. ఆ హరర్ ఎలిమెంట్స్ అలా చూస్తేనే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మిరల్ మూవీని చూసేయండి..

రివ్యూ రేటింగ్ : 2.25 / 5.0
మిరల్ మూవీ

Read Also : Gold Investment 2024 : బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? భారత్‌లో బంగారాన్ని ఎన్ని మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు!

Leave a Comment